మంత్రి నారా లోకేశ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు.

మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేశారు. "కార్యకర్తే అధినేత" అన్న నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ, తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.

మండలిలో వైసీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, చివరకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి ఆమోదం లభించింది. అనంతరం ఆయనకు అధికారికంగా అపాయింట్‌మెంట్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం జరిగిందని భావోద్వేగానికి గురయ్యారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య, అతని కుమారుడు ఆదినారాయణల అక్రమాలపై టీడీపీ నేత తోట చంద్రయ్య పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న వారు 2022 జనవరి 13న గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చంద్రయ్యపై నడిరోడ్డుపై దాడి చేసి, కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. రాజకీయ ప్రేరేపిత ఘర్షణల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించేందుకు చట్ట సవరణ అవసరమైంది. అనంతరం న్యాయశాఖ గెజిట్ జారీ చేయడంతో ఉద్యోగ నియామకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో తోట వీరాంజనేయులును జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఈ పరిణామంతో తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరినట్లయిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.