అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ చేపట్టిన 'వెన్నుపోటు రెండేళ్లు' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేకేతిరెడ్డి పెద్దారెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు, పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దారెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొందరు కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు. తాడిపత్రి పట్టణంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు.
వైసీపీ తలపెట్టిన 'వెన్నుపోటు రెండేళ్లు' కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చిన తమ నేతను అకారణంగా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.